: పోలీసు అధికారికి 263 ఏళ్ల జైలు... అమెరికా కోర్టు సంచలన తీర్పు
మహిళలను అఘాయిత్యాల నుంచి రక్షించాల్సిన గురుతర బాధ్యత ఉన్న ఓ పోలీసు అధికారి... తానే భక్షకుడిగా మారాడు. విధి నిర్వహణలోనే పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు దిగాడు. అత్యాచారపర్వాన్ని కొనసాగించాడు. పోలీసు అధికారి హోదాను అడ్డం పెట్టుకుని కొందరిని లొంగదీసుకున్న అతడు, మరికొందరిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే అతడు నిఘాకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కోర్టు విచారణలో దోషిగా తేలాడు. అతడికి 263 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో అప్పటిదాకా ఏదో చిన్న శిక్షతో బయటపడతాననుకుని నిబ్బరంగా కూర్చున్న ఆ ‘భక్షక’ పోలీస్ కోర్టు హాల్లోనే కన్నీటిపర్యంతమయ్యాడు. వందల ఏళ్ల జైలు శిక్షను ప్రకటించిన న్యాయమూర్తి... సదరు తీర్పుపై పై స్థాయి కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశాన్ని కూడా నిందితుడికి ఇవ్వకపోవడం గమనార్హం. ఈ ఉదంతం అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికాలో చోటుచేసుకుంది. ఓక్లహామా నగరంలో పోలీసు అధికారిగా పనిచేస్తున్న డేనియల్ హాల్ట్ క్లా... విధి నిర్వహణలో ఉంటూనే అఘాయిత్యాలు సాగించి చివరకు జీవిత కాలమంతా జైల్లోనే గడిపేందుకు ఏడుస్తూనే వెళ్లిపోయాడు.