: ‘పోల్ హీరో‘కు బీహార్ కేబినెట్ మినిస్టర్ హోదా!...నితీశ్ సలహాదారుగా ప్రశాంత్ కిషోర్
‘చాయ్ పే చర్చా’ నినాదంతో నరేంద్ర మోదీకి, ‘పర్చా పే చర్చా’ పేరిట నితీశ్ కుమార్ కు వినూత్న రీతిలో ప్రచారం చేసిపెట్టిన ప్రశాంత్ కిషోర్... వారి విజయాల్లో కీలక భూమికే పోషించారు. 2014 దాకా ఓ మోస్తరు వేగంతో సాగిన ఎన్నికల ప్రచారం... ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో పరుగులు పెట్టింది. కొత్త పుంతలు తొక్కింది. జనాన్ని ఆకట్టుకుంది. జన నేతలకు విజయం కట్టబెట్టింది. అధికార పీఠాలను అందించింది. అంతేకాదు... ప్రశాంత్ కిషోర్ కు కూడా కేబినెట్ మినిస్టర్ ర్యాంకును సాధించిపెట్టింది. అవును, తన విజయంలో కీలక భూమిక పోషించిన ప్రశాంత్ కిషోర్ ను నరేంద్ర మోదీ మరిచిపోయి ఉండవచ్చు కానీ, నితీశ్ కుమార్ మాత్రం మరిచిపోలేదు. బీహార్ సీఎం హోదాలో ఉన్న తనకు ప్రశాంత్ కిషోర్ ను ‘సలహాదారు’గా నియమించుకున్నారు. అది కూడా కేబినెట్ మినిస్టర్ ర్యాంకులో ప్రశాంత్ ను సలహాదారు పదవిలో నియమిస్తూ నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశారు.