: 'వాడిని లష్కరే తోయిబాకు అప్పగించండి'... బీజేపీ నేతపై కాశ్మీర్ ఎమ్మెల్యే
నిత్యమూ వివాదాల చుట్టూ తిరుగుతుండే కాశ్మీర్ ఎమ్మెల్యే రషీద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలను కొనితెచ్చుకున్నారు. ఓ నిరసన ప్రదర్శనలో ప్రసంగించిన అవామీ ఇతేహద్ పార్టీ నేత రషీద్, "ఈ రాత్రికి వాడిని లష్కరే తోయిబాకు అప్పగించండి" అని తన కార్యకర్తలతో అంటున్న వీడియో వెలుగులోకి వచ్చింది. పుల్వామా జిల్లాలో జరిగిన ఓ ఆందోళనలో ఈ ఘటన జరుగగా, గతంలో తనను ఉగ్రవాదిగా అభివర్ణించిన ఓ బీజేపీ నేత గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఆయన ఎవరి గురించి ఈ మాటలన్నారన్నది వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపతోంది. గతంలో బీఫ్ పార్టీ నిర్వహించిన రషీద్ పై అసెంబ్లీ వేదికగా బీజేపీ ఎమ్మెల్యేలు దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కాశ్మీరు లోయలో, ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో రషీద్ కు ప్రజాభిమానం పెరుగుతోంది.