: బాధ్యులపై చర్యలు కోరాలి... మంత్రుల రాజీనామా డిమాండ్ సరికాదు: యూపీ గవర్నర్
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు చేస్తున్నవారు ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాలి కానీ, కేంద్ర మంత్రుల రాజీనామాలు కోరడం సరికాదని ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్ అన్నారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాల డిమాండ్ సరికాదని స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యపై నిజాలు నిగ్గుతేల్చేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ కమిటీని వేసిందని గుర్తు చేసిన ఆయన, వాస్తవాలు వెలుగులోకి వచ్చేవరకు ఓపిక పట్టాలని సూచించారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తరువాత బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేయాలి తప్ప కేంద్ర మంత్రుల రాజీనామాలు కోరడం కాదని ఆయన స్పష్టం చేశారు.