: రేపు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మంత్రి కామినేనికి మోకాలి సర్జరీ
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు సర్జరీ జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ నాయకుడిగా తానేం చెబుతానో దానినే ఆచరిస్తానని అన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎన్నో ప్రైవేటు ఆసుపత్రులుండగా, ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ తాను ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ చేయించుకునేందుకు మొగ్గుచూపానని అన్నారు. మంత్రిగా తానే ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకోకపోతే...ప్రజలు ఎందుకు ప్రభుత్వాసుపత్రుల వైపు చూస్తారని ఆయన ప్రశ్నించారు. కేవలం డెలివరీలకు తప్ప, ఇతర సమస్యలకు ప్రజలు ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయించడం లేదని అన్నారు. దీనికి వారిలో నెలకొన్న అనుమానాలే కారణమని ఆయన చెప్పారు. వాటన్నింటినీ పారద్రోలేందుకే తన పిల్లలు యూఎస్ రమ్మంటున్నా వెళ్లకుండా గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మోకాలికి మేజర్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధపడ్డానని ఆయన తెలిపారు. ఇకపై ప్రభుత్వాసుపత్రులపై చిన్నచూపు పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తన ఆపరేషన్ కోసం నిపుణులైన వైద్యులు ఇతర ఆసుపత్రుల నుంచి అక్కడికి వస్తారని ఆయన చెప్పడం కొసమెరుపు!