: దావోస్ కు పదోసారి వచ్చా...ప్రతిసారి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నా!: సీఎం చంద్రబాబు
పదోసారి దావోస్ లో పర్యటిస్తున్నానని.. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీఐఐ ఇన్వెస్టర్స్ మీట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో సహజవనరులు, అపార ఖనిజ సంపదతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు, సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నాయన్నారు. వీటన్నింటికీ మించి నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్ సొంతమని అన్నారు. అద్భుతమైన వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని, సంక్షేమ కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టిపెట్టామని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచగలిగామని, సంతులిత వృద్ధి ఏపీ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధికి నిధులనేవి తప్పనిసరికాదని, ప్రభుత్వ నిధులు వినియోగించకుండానే సైబరాబాద్, హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.