: బురఖా వద్దని ఆంక్షలు, 13 వేల మందికి షేవింగ్... తజకిస్థాన్ సంచలన నిర్ణయం!
ఉగ్రవాదులను ఎలాగైనా నిలువరించాలని, పొరుగున ఉన్న దేశాల ప్రభావం తమపై ఎలాగైనా పడరాదన్న ఉద్దేశంతో ముస్లిం మెజారిటీ దేశంగా గుర్తింపున్న తజకిస్థాన్ సంచలన నిర్ణయాలు అమలు చేస్తోంది. దేశంలో గడ్డాలు పెంచుకుని తిరుగుతున్న 13 వేల మందికి గడ్డాలు గీయించడంతో పాటు బురఖాలు ధరించవద్దని మహిళలకు పిలుపు నిచ్చింది. ఆఫ్గన్ ప్రభావం తమపై ఉండకుండా ఉండేందుకే ఈ నిర్ణయాలంటూ, ఆ దేశ ప్రభుత్వం ప్రజలకు చెప్పగా, ఇప్పటికే 1700 మంది యువతులు, మహిళలు బురఖాలు వదిలేందుకు అంగీకరించారని ముస్లిం టెలివిజన్ చానల్ అల్ జజీరా ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఉగ్రజాడలు తమపై పడకుండా ప్రజలను కాపాడుతూ వస్తున్న దేశాల్లో తజకిస్థాన్ ఒకటన్న విషయం తెలిసిందే. కాగా, ఉగ్ర మూలాలు తమ దేశంలో ఉండరాదన్న ఉద్దేశంతో గత వారంలో తజక్ పార్లమెంట్ అరబ్ పదాలను నిషేధించింది. తొలి మేనరికాల మధ్య వివాహాలనూ నిషేధించింది. ఇస్లామిక్ రినైజాన్స్ పార్టీని నిషేధించింది. ప్రజల్లో లౌకిక భావాలను పెంచేందుకు మరిన్ని కొత్త చట్టాలు తెస్తామని ప్రస్తుత అధ్యక్షుడు ఇమొమాలీ రఖ్మోన్ చెబుతుంటే, ప్రజలు సైతం అంగీకరిస్తుండటం గమనార్హం. అయితే, ఈ నిబంధనల అమలు ఇస్లాం మత విశ్వాసాలకు వ్యతిరేకమని విమర్శిస్తున్న వారూ లేకపోలేదు. అయినా ప్రజలు లౌకికవాదం వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.