: క్షణాల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని విధుల్లో నిమగ్నమైన పోలీస్...మీరూ చూడండి
సాధారణంగా ఎవరైనా దుండగుడు వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీ గురిపెడితే...షాక్ కు గురై బిక్కచచ్చిపోతాం. కానీ, ఓ పోలీస్ మాత్రం క్షణాల్లో దాని నుంచి బయటపడి, ఎదురుకాల్పులు జరిపిన ఘటన సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దక్షిణాఫ్రికాలోని జాతీయ రహదారిపై నిబంధనలు ఉల్లంఘించిన వాహనాన్ని ఆపిన పోలీస్ అధికారి, అందులోని వ్యక్తులకు ఫైన్ రాయడంపై నిమగ్నమయ్యారు. ఇంతలో అటుగా వస్తున్న ఓ దుండగుడు పోలీస్ ను చూసి, అతని దగ్గరకు వెళ్లి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీ గురిపెట్టాడు. హఠాత్తుగా వచ్చిన వ్యక్తిని చూసిన పోలీస్ ఒకింత ఆశ్చర్యానికి గురై ప్రశ్నించేలోపు అతని చేతిలో తుపాకీ చూశాడు. దీంతో ఆలస్యం చేయకుండా ఏ కారుకైతే ఫైన్ రాశాడో అదే కారు బోనెట్ ముందు కూర్చున్నాడు. వెంటనే దుండగడు కారుకు రెండో వైపు వచ్చి అతనిని కాల్చే ప్రయత్నం చేశాడు. అప్పటికే కర్తవ్యం గుర్తున్న పోలీస్ తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో దుండగుడు పరుగులంకించుకున్నాడు. ఈ వివరాలన్నీ అక్కడే నిల్చున్న కారు డాష్ బోర్డ్ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దీనిని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టగా, అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.