: ఎన్టీఆర్ వైద్యమిత్ర ఉద్యోగులను తొలగించడం బాధాకరం: విష్ణుకుమార్ రాజు
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ వైద్యమిత్ర ఉద్యోగులు ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజును విశాఖలో కలిశారు. ప్రభుత్వం తమను తొలగించడంపై ఆయనకు విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర వ్యాప్తంగా వైద్యమిత్ర ఉద్యోగులను తొలగించడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వానికి ఇది ధర్మం కాదని, ఎటువంటి నోటీసులు లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఒక్క విశాఖలోనే 215 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 శాతం జీతాలు పెంచి ఉద్యోగాలు ఇస్తుంటే... ఏపీలో మాత్రం జీతం పెరుగుతున్న సమయంలో ఇలా ఉద్యోగులను తొలగించడం సమర్ధనీయం కాదని పేర్కొన్నారు. త్వరలోనే వైద్య మిత్ర ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు రాజు చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా చర్చిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.