: ఆ కుటుంబంలో అందరూ జడ్జిలే... ఓకేసారి జడ్జిలుగా ఎంపికైన అక్కా తమ్ముడు


ఒక కుటుంబంలో పలువురు డాక్టర్లు, న్యాయవాదులు, ఇంగినీర్లు... ఇలా పలు వృత్తుల్లో ఉన్నవారిని చూశాం. కానీ ఒకే కుటుంబం నుంచి అందరూ జడ్జిలు అవడం అన్నది ఇప్పుడు చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన అంగడి లక్ష్మయ్య, సరోజనమ్మ దంపతులకు జయరాజు, నిర్మల, ప్రదీప్ అనే ముగ్గురు సంతానం. వారిది వ్యవసాయ కుటుంబం. వారిలో జయరాజు ఇప్పటికే మొదటిసారి జడ్జిగా (2003 నుంచి) ఎంపికై పనిచేస్తున్నారు. తాజాగా మిగతా ఇద్దరు నిర్మల, ప్రదీప్ కూడా అన్న బాటలో నడిచి జడ్జిలయ్యారు. ఇటీవల జూనియర్ సివిల్ జడ్జి పోటీ పరీక్షలకు వీరిని పెద్దన్న తగిన విధంగా సిద్ధం చేయడంతో... అక్కా తమ్ముడు కూడా జడ్జిలుగా ఎంపికయ్యారు. దాంతో ఖమ్మం జిల్లాలోనే ఏకైక జడ్జిల ఫ్యామిలీగా వీరు పేరు తెచ్చుకున్నారు. నిర్మల కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. గత ఏడాది నుంచి ఖమ్మం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక ప్రదీప్ విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ పూర్తి చేశారు. 2011 నుంచి ఖమ్మం కోర్టులో ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 2014లో జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ వెలువడటంతో ఇద్దరూ దరఖాస్తు చేశారు. గతేడాది జూన్ లో స్క్రీనింగ్ టెస్ట్, అక్టోబర్ లో జరిగిన మెయిన్స్ లో అక్కా తమ్ముడు మంచి ప్రతిభ కనబరిచి ఇంటర్వ్యూలకు ఎంపికై, డిసెంబర్ 17న జరిగిన ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఆ తరువాత జడ్జి పోస్టులకు వీరు ఎంపికవడం జరిగింది. తమ అన్నయ్య జయరాజును స్పూర్తిగా తీసుకుని పరీక్షలకు సిద్ధమయ్యామని నిర్మల అంటే, చిన్నతనం నుంచి 'లా' అంటే ఎంతో ఆసక్తి అని ప్రదీప్ చెప్పాడు.

  • Loading...

More Telugu News