: దానం వర్సెస్ విష్ణు!... సోమాజీగూడ సీటుపై ఇరువురి మధ్య యుద్ధం


కాంగ్రెస్ కు చెందిన గ్రేటర్ శాఖలో మరోమారు ‘యుద్ధం’ మొదలైంది. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల దాఖలు పూర్తి కాగా, నేటి సాయంత్రంలోగా నామినేషన్ల ఉపసంహరణకు విధించిన గడువు కూడా ముగియనుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నేటి సాయంత్రంలోగా ఆయా పార్టీలకు చెందిన నేతలు తమ పార్టీల నుంచి బీఫాం సాధిస్తేనే పార్టీ అభ్యర్థులుగా బరిలో ఉంటారు. లేదంటే ఇండింపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలవాల్సి వస్తుంది. ఈ క్రమంలో సోమాజిగూడ డివిజన్ నుంచి బరిలోకి దిగాల్సిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై ఆ పార్టీ గ్రేటర్ చీఫ్ దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే, దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ స్థానం నుంచి తాను ప్రతిపాదించిన అభ్యర్థినే బరిలోకి దించాలని విష్ణు పట్టుబడుతుండగా, ఖైరతాబాదు మాజీ ఎమ్మెల్యేగా తనకూ అభ్యర్థిని నిర్ణయించడంలో హక్కుందంటూ దానం కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో విష్ణు ప్రతిపాదించిన అభ్యర్థిని దానం తిరస్కరించగా, దానం ప్రతిపాదించిన అభ్యర్థిని విష్ణు తిరస్కరించారు. దీంతో అభ్యర్థి ఖరారు విషయంలో ఇరువురు నేతలు పట్టుదలతో ఉండటంతో ఆ పార్టీ సీనియర్లు ఎవరికీ సర్దిచెప్పలేక తలలు పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News