: ప్రముఖ నృత్య కళాకారిణి మృణాళినీ సారాభాయ్ కన్నుమూత
ప్రముఖ నృత్య కళాకారిణి, పద్మభూషణ్ మృణాళినీ సారాభాయ్ (97) ఈ ఉదయం అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వృధ్ధాప్యం కారణంగా ఏర్పడిన అనారోగ్యంతో ఆమెను నిన్న ఆసుపత్రిలో చేర్చగా, నేడు ప్రాణాలు విడిచారని ఆమె కుమార్తె మల్లికా సారాభాయ్ తన ఫేస్ బుక్ తెలిపారు. "మా అమ్మ మృణాళినీ సారాభాయ్ తన అమర నృత్య ప్రదర్శన కోసం వెళ్లిపోయారు" అని పోస్ట్ పెట్టారు. భారత అంతరిక్ష పితామహుడిగా పేరున్న విక్రమ్ సారాభాయ్ ని 1942లో వివాహం చేసుకున్న ఆమె, 'దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ ఫార్మింగ్ ఆర్ట్స్' పేరిట అహ్మదాబాద్ కేంద్రంగా అకాడమీని నిర్వహిస్తూ, 18 వేల మంది విద్యార్థులకు భరతనాట్యం, కథాకళి నృత్య రీతుల్లో శిక్షణ ఇచ్చారు. చిన్నతనంలో రవీంద్రనాథ ఠాగూర్ శిష్యురాలిగి ఉన్న ఆమె, అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో సైతం శిక్షణ పొందారు. అమె కుటుంబమంతా విధ్యాధికులు, దేశభక్తులే. తండ్రి డాక్టర్ స్వామినాథన్, పెద్ద సోదరుడు గోవింద్ స్వామినాథన్ లు మద్రాసు హైకోర్టులో ప్రముఖ న్యాయవాదులుగా పేరు పొందగా, ఆమె తల్లి అమ్మూ స్వామినాథన్ స్వాతంత్ర సమరయోధురాలు. చెల్లెలు లక్ష్మీ సెహగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం 'రాణీ ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్'లో కమాండ్-ఇన్-చీఫ్ గా విధులు నిర్వహించారు. ఆమె కుమారుడు కార్తికేయ సారాభాయ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ (సీఈఈ) వ్యవస్థాపకుడు కాగా, కుమార్తె మల్లిక, భారత సంప్రదాయ నృత్యాల ప్రచారకర్తగా ఉన్నారు. ఆమె మృతికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.