: భత్కల్ సోదరుల సంస్థకు దక్షిణాసియా 'ఉగ్ర' బాధ్యత అప్పగించిన ఐఎస్ఐఎస్


దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాద చర్యలను ముమ్మరం చేసే బాధ్యతలను భత్కల్ సోదరుల సంస్థ 'అన్సార్-ఉత్ తాహిద్ ఫీ బిలాద్ అల్-హింద్' (ఏయూటీ) కు ఐఎస్ఐఎస్ అప్పగించిందని నిఘా వర్గాలు గుర్తించాయి. భత్కల్ సోదరులు ప్రారంభించిన ఈ సంస్థలో పలువురు సభ్యులుగా ఉన్నారని తెలుస్తోంది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ముజాహిద్దీన్ 2013లో విడిపోయిన తరువాత భత్కల్ సోదరుల్లో ఒకడైన షఫీ అర్మార్ ఏయూటీ బాధ్యతలు స్వీకరించాడు. యాసిన్ భత్కల్, అతని అనుయాయుల సహకారంతో ఐఎస్ మాడ్యూల్స్ ఇప్పటికే దేశంలో విస్తరించాయని, కొందరు ఉత్తరభారత పట్టణం ఆజాంగఢ్ లో ఆశ్రయం పొందుతున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఏయూటీలో సభ్యులైన షఫీ అమర్, ఆయన సోదరుడు అబ్దుల్ ఖాదిర్ సుల్తాన్ అమర్ లతో పాటు మరికొందరు ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాలకు వెళ్లి అల్ ఖైదాలో చేరారని, ఆపై దీర్ఘకాలంలో ఐఎస్ఐఎస్ మాత్రమే నిలుస్తుందని భావించి దానిలో చేరిపోయారని తెలుస్తోంది. పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రసంస్థల మాదిరిగా కాకుండా ఏయూటీ అనతి కాలంలోనే ఐఎస్ఐఎస్ సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని, దానికి దగ్గరైందని సమాచారం. ఏయూటీ మీడియా వింగ్ గా ఉన్న అల్ ఇసభా ప్రొడక్షన్స్ ను స్వయంగా పర్యవేక్షిస్తున్న షఫీ అర్మార్, ఇటీవల ఐఎస్ఐఎస్ చీఫ్ అల్ బగ్దాదీ శుక్రవారం ప్రార్థనల వీడియోలు అప్ లోడ్ చేయగా, ఆ వెంటనే వాటిని కాలిఫేట్ షేర్ చేసుకుంది. వీరికి భారత్ లోని మరో ఉగ్రసంస్థ సిమీ సభ్యులతో సత్సంబంధాలు ఉన్నాయని, అది భారత్ కు ప్రమాదమని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News