: హిమాలయాలకు వెళుతున్నానంటూ అదృశ్యమైన మద్రాస్ ఐఐటీ స్టూడెంట్ ప్రత్యూష నుంచి ఫోన్!
మద్రాస్ ఐఐటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతూ, తాను హిమాలయాలకు వెళ్లిపోతున్నానని లేఖ రాసిపెట్టి, ఆదివారం నాడు అదృశ్యమైన వేదాంతం ఎల్ ప్రత్యూష (20) గుంటూరులో ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానన్న విషయం మాత్రం ఆమె చెప్పలేదని, క్షేమంగా ఉన్నానని, తన విషయమై కంగారు పడవద్దని చెప్పినట్టు ప్రత్యూష తల్లి వివరించారు. తన కుమార్తె భద్రతపై ఆందోళనగా ఉందని అన్నారు. కాగా, ఆదివారం నాడు ప్రత్యూష హాస్టల్ విడిచి వెళ్లిన అనంతరం వార్డన్ ఫిర్యాదు మేరకు చెన్నై పరిధిలోని కొట్టూరుపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.