: బచాఖాన్ ‘ఉగ్ర’ దాడి వెనుక పారికర్ కుట్ర!... పాక్ హోం మంత్రి సంచలన వ్యాఖ్య


పాకిస్థాన్ లోని బచాఖాన్ యూనివర్సిటీపై నిన్న జరిగిన ఉగ్రవాద దాడికి తామే కారణమంటూ ఓ వైపు తెహ్రీక్-ఏ-తాలిబాన్ ప్రకటించినా, ఆ దేశ హోం మంత్రి రెహ్మాన్ మాలిక్ మాత్రం ఓ సంచలన ప్రకటన చేశారు. దాడి వెనుక భారత్ హస్తముందని ప్రకటించిన ఆయన దాడి వెనుక భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కుట్ర దాగుందని పేర్కొని కలకలం రేపారు. తాలిబాన్లతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న భారత్ ఈ దాడికి పథక రచన చేసిందని కూడా ఆయన ఆరోపించారు. మరోహర్ పారికర్ కనుసన్నల్లో నడుస్తున్న భారత గూఢచార సంస్థ ‘రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా)’ ఈ దాడికి రూపకల్పన చేసిందని మాలిక్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిని కూడా ప్రస్తావించారు. ‘‘పఠాన్ కోట్ దాడిలో జైషే మొహ్మద్ పాత్ర లేదు. భారతీయులే ఆ తరహా దాడులకు పాల్పడుతున్నారు. భారత్, పాక్ ల మధ్య సంబంధాలు మెరుగవడం ‘రా’కు ఇష్టం లేదు. ఎప్పుడైతే చర్చలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందడుగు వేశారో, దానిని నిలువరించేందుకు ‘రా’ అధికారులు ఈ దాడులకు తెర తీశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పారికర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎంతమాత్రం సహనంతో ఉండేది లేదన్న పారికర్, పాక్ కూడా ఈ తరహా అనుభవాలను అనుభవించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. పాకికర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన మాలిక్... ఆ తరహా ఘాటు వ్యాఖ్యలు చేయడానికి పారికర్ కు ఎంత ధైర్యమంటూ కూడా ఊగిపోయారు.

  • Loading...

More Telugu News