: నేను హిందూత్వను వ్యతిరేకిస్తున్నాను: అసదుద్దీన్ ఒవైసీ
బ్రాహ్మణ అగ్రకుల అహంకారానికి ఎంతో భవిష్యత్ ఉన్న మేధావి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాదులోని హెచ్ సీయూలో ఆందోళనకారులకు మద్దతు తెలిపిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ భారతదేశంలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని, ఇతరులు ఉండకూడదని భావిస్తోందని అన్నారు. హిందూత్వ వాదాన్ని వ్యతిరేకిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం అందరిదీ అని పేర్కొన్న ఆయన, హిందూత్వ వాదాన్ని వ్యతిరేకించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన తెలిపారు. హిందువు కాకపోతే భారతదేశంలో నివసించకూడదనే నిబంధన లేదని ఆయన గుర్తు చేశారు. భారతదేశం అందరి దేశం అని చెప్పిన ఆయన, విద్యా సంస్థల్లో రాజకీయనాయకుల ప్రమేయం సరికాదని తెలిపారు. రాజకీయాలు చేసుకునేందుకు వేరే వేదికలు ఉన్నాయని చెప్పిన ఆయన బీజేపీ నేతలు అక్కడ రాజకీయాలు చేసుకోవాలని సూచించారు.