: ఆ యూనివర్సిటీని 'సరిహద్దు గాంధీ' పేరిట నెలకొల్పారు
పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాదులు చొరబడిన యూనివర్సిటీని మహాత్మాగాంధీ సన్నిహితుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతీయులు ముద్దుగా సరిహద్దు గాంధీగా పిలచుకునే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరిట నెలకొల్పారు. అహింసాయుత మార్గంలో బ్రిటిష్ వారిపై పోరాడిన స్పూర్తితో దేశ ప్రజలంతా విద్యావంతులు కావాలనే కోరికతో శాంతి, సమైక్యత లక్ష్యంగా ఆయన పేరు మీద ఈ యూనివర్సిటీని పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1890లో జన్మించిన ఆయన పాకిస్థాన్ లో బచాఖాన్ గా పేరుగాంచారు. భారత్ లో చీలిక తప్పదని గ్రహించిన ఆయన ఆఫ్ఘనిస్థాన్ లోని కొన్ని ప్రాంతాలతో కలిపి ఫక్తూనిస్తాన్ గా పాక్ తో పాటు మరోదేశంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 1988లో 98 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందారు. ఆయన వర్ధంతి సందర్భంగా నేడు యూనివర్సిటీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కోసం అతిథులు, విద్యార్థులు సిద్ధమవుతున్న తరుణంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.