: ధావన్, కోహ్లీల శతకాలు వృథా...కుప్పకూలి ఓటమిపాలైన టీమిండియా
శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీల సెంచరీలు వృథా అయ్యాయి. టీమిండియా ఆటగాళ్ల ఘోరవైఫల్యంతో నాలుగో వన్డేలో భారత జట్టు పరాజయం పాలైంది. రోహిత్, ధావన్, కోహ్లీ ఇచ్చిన అద్భుతమైన ఆరంభాన్ని అందుకోవడంలో ఇతర ఆటగాళ్లు తడబడ్డారు. దీంతో, 25 పరుగుల తేడాతో పరాజయంపాలైన భారత్ క్లీన్ స్విప్ ముంగిట నిలిచింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. వార్నర్ (97), ఫించ్ (107), స్మిత్ (51) ధాటిగా ఆడడంతో 348 పరుగులు చేసింది. 349 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ధాటిగా ఆడారు. భారీ షాట్ ఆడే క్రమంలో రోహిత్ పెవిలియన్ బాటపట్టగా, అనంతరం వచ్చిన కోహ్లీ (109) మరింత వేగంగా అడాడు. దీంతో ఓ దశలో టీమిండియా సునాయాసంగా విజయం సాధిస్తుందని అభిమానులు భావించారు. అప్పుడు ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. క్రీజులో పాతుకుపోయిన శిఖర్ ధావన్ (126), విరాట్ కోహ్లీ (106) జోడీని విడదీసింది. హైస్టింగ్స్ వేసిన బంతిని బెయిలీ చేతుల్లోకి కొట్టిన ధావన్ పెవిలియన్ చేరాడు. అనంతరం కేవలం రెండు బంతులను ఎదుర్కొన్న ధోనీ పరుగులేమీ చేయకుండా స్లిప్స్ లో వేడ్ కు దొరికిపోయాడు. దీంతో, అంతవరకు నిలకడగా ఆడిన కోహ్లీ లయతప్పాడు. దీంతో భారీ షాట్ కు యత్నించి మిడాఫ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చాడు. కొత్త కుర్రాడు గురుకీరత్ సింగ్ (5) మరోసారి నిరాశపరిచాడు. భారీ స్వీప్ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. రహానే (2) ధోనీలా స్లిప్స్ లో దొరికిపోయి పెవిలియన్ బాటపట్టాడు. వస్తూనే విరుచుకుపడేందుకు ప్రయత్నించిన రిషి ధావన్ (9) ను వార్నర్ ఒడిసిపట్టేశాడు. భువనేశ్వర్ (2), ఉమేష్ యాదవ్ (2), ఇషాంత్ శర్మ (0) క్రీజులో నిలబడేందుకు ఇబ్బంది పడి పెవిలియన్ చేరారు. రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేసి 24 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 49.2 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్ సన్ 5 వికెట్లతో రాణించగా, అతనికి హేస్టింగ్స్, మార్ష్ చెరి రెండు వికెట్లతో రాణించగా, లైయోన్ ఒక వికెట్ తో సత్తాచాటారు.