: రామ్ చరణ్ పేరు చెబితే చప్పట్లు కొట్టలేదు..ఎందుకంటే...: యండమూరి వీరేంద్రనాథ్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంజనీరింగ్ కళాశాల ఫంక్షన్ కు హాజరైన ఆయన, మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి సూపర్ హిట్ చిత్రం 'అభిలాష' సినిమాకు పనిచేసిన రోజులతో పాటు, రామ్ చరణ్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రామ్ చరణ్ ను హీరోను చేయడం కోసం అతని తల్లి సురేఖ ఎంతో కష్టపడేదని, డ్యాన్స్ లు నేర్పించేదని అన్నారు. అప్పట్లో రామ్ చరణ్ దవడ సరిగా ఉండేది కాదని, ఆ తర్వాత దాన్ని కూడా సరిచేయించారని అన్నారు. అదే సమయంలో మరో కుర్రాడు కూడా ఉండేవాడని, పాట విని అది ఏ రాగమో చెప్పేవాడని, ఆ కుర్రాడు ఎవరోకాదు దేవిశ్రీ ప్రసాద్' అని యండమూరి అన్నారు. ఇళయరాజా స్వరపరిచిన ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాట విని అది శివరంజనీ రాగమని నాడు దేవిశ్రీ ప్రసాద్ చెప్పగా..ఇళయరాజా అతన్ని మెచ్చుకున్న విషయాన్ని చెప్పారు. అనంతరం మరో విశ్లేషణ కూడా యండమూరి చేశారు. 'రామ్ చరణ్ పేరు చెప్పగానే మీరు చప్పట్లు కొట్టలేదు, కానీ, దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పినపుడు మీరు చప్పట్లు మోగించారు. దీనికి కారణం దేవిశ్రీ ప్రసాద్ స్వశక్తితో ఎదగడమే' నని ఆయన చెప్పుకొచ్చారు. ‘నువ్వు ఏమిటి అన్నది ముఖ్యం. మీ నాన్న ఎవరన్నది కాదు’ అని యండమూరి అన్నారు. కాగా, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయన పలు హిట్ చిత్రాలకు పనిచేశారు. కొంతకాలంగా, సినిమా రంగానికి యండమూరి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News