: ఉగ్రవాదులకు మతం లేదు...బచాఖాన్ దాడిని ఖండించిన పాక్ ప్రధాని షరీఫ్
పాకిస్థాన్ లోని బచాఖాన్ వర్సిటీపై ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో 20 మందికి పైగా చనిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో 50 మందికి పైగా గాయపడ్డట్లు ప్రాథమిక సమాచారం. దాడి జరిగిన వెంటనే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఘాటుగా స్పందించారు. ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు మతమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. అమాయకులైన విద్యార్థులు, పౌరులను చంపేస్తున్న ఉగ్రవాదులలకు మతం గాని, విశ్వాసం గాని లేవని షరీఫ్ అన్నారు. ఉగ్రవాదాన్ని పాక్ భూభాగం నుంచి తరిమికొట్టేందుకే నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. లెక్కలేనంత మంది దేశ పౌరుల త్యాగాలను వృథా కానివ్వబోమని ప్రతినబూనారు. ఈ మేరకు పాక్ ప్రధాని పేరిట విడుదలైన ఓ అధికారిక ప్రకటనలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.