: అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకుని... రోహిత్ వేముల కొట్టాడని చెప్పిన ఏబీవీపీ నేత!
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై ఏబీవీపీ ప్రచారం చేస్తున్న ఘర్షణ అవాస్తవమని దాదాపుగా తేలిపోయింది. ఓ వివాదం నేపథ్యంలో అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ (ఏఎస్ఏ), ఏబీవీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రోహిత్ సహా ఏఎస్ఏ కార్యకర్తలు తనను ఒక్కడిని చేసి తీవ్రంగా కొట్టారని, దీంతో తీవ్రంగా గాయపడ్డ తాను ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నానని ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ చెప్పాడు. అయితే అతడు చెప్పిన మాట వాస్తవం కాదని నేషనల్ మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. సుశీల్ కుమార్ చికిత్స చేయించుకున్నట్లుగా చెబుతున్న మదీనాగూడలోని అర్చనా హాస్పిటల్స్ వైద్య నివేదిక ఆ కథనాల్లో ప్రస్తావనకు వచ్చింది. మెడికల్ రిపోర్టును చేజిక్కించుకున్న సదరు మీడియా సంస్థలు.. సుశీల్ అబద్ధం చెబుతున్నాడని రాశాయి. అపెండిసైటిస్ కారణంగా ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న సుశీల్ కుమార్ శరీరంపై గాయాలేమీ లేవని సదరు నివేదకను ఊటంకిస్తూ వార్తలు రాశాయి.