: షాపు ఓపెన్ చేయడమే కాకుండా, రూ. 1.38 లక్షలు పెట్టి చీర కొన్న కర్ణాటక సీఎం
ఏవైనా వస్త్ర దుకాణాలు ప్రారంభించడానికి వచ్చే రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వెళ్లేటప్పుడు తమకు నచ్చిన కొన్ని దుస్తులను వెంటేసుకుపోతారన్నది ఎన్నోసార్లు విన్నాం. 'బోణీ చేయాలి' అనుకున్నా వారు తీసుకున్న దుస్తులకు, ఇచ్చే మొత్తానికి 'నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా' ఉంటుంది. కానీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇదే తరహా ఘటనలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. దావణగెరెలోని నూతన వ్యాపార భవన సముదాయంలో మైసూర్ పట్టు చీరల దుకాణాన్ని ప్రారంభించిన ఆయన, అక్కడ కలియదిరుగుతూ, తన కంటికి అద్భుతంగా కనిపించిన ఓ చీరను చూసి ముచ్చటపడ్డారు. దాని ఖరీదు రూ. 1.38 లక్షలని తెలుసుకొని కొంత ఆశ్చర్యపోయి, ఆ వెంటనే అది కావాలని చెప్పి డబ్బిచ్చి మరీ దాన్ని తీసుకున్నారు. ఈ వార్తను కన్నడనాట పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.