: తెరపైకి వస్తున్న గులాం అలీ... హిందీ సినిమా 'ఘర్ వాపసి'లో నటిస్తున్న పాకిస్తాన్ గజల్ కింగ్
శివసేన నుండి పలుమార్లు బెదిరింపులను ఎదుర్కొన్న ప్రముఖ పాకిస్తాన్ గజల్ గాయకుడు గులాం అలీ తొలిసారిగా సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా భారత్ లో నిర్మించే హిందీ సినిమా 'ఘర్ వాపసి' కావడం విశేషం. అంతేకాదు, ఇందులో ఆయన ఒక దేశభక్తి గీతాన్ని కూడా ఆలపించారు. సాహిబ్ ఇల్యాసి దర్శకత్వంలో ఢిల్లీలో ఇటీవలే చిత్రీకరణ మొదలైన ఈ సినిమాలో నటించడం తనకు కొత్తగా ఉందని, మూడు నాలుగు రోజుల పాటు ఇక్కడ జరిగే చిత్రీకరణలో పాల్గొంటానని తెలిపారు. ఇదిలా ఉండగా, గతవారం గులాం అలీ కోల్ కతాలో సంగీత ప్రదర్శన నిర్వహించారు. మూడు నెలల క్రితమే జరగాల్సిన ఈ కార్యక్రమం శివసేన ఆందోళనల కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. కాగా భారత్, పాక్ దేశాల ప్రధానులు శాంతి చర్చలు కొనసాగించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. తద్వారా ఇరు దేశాల కళలు, సాంప్రదాయాల బంధం బలపడుతుందని అభిప్రాయపడ్డారు.