: ‘జనరల్ కేటగిరీ’లోనే సీటు సాధించిన రోహిత్... సామాజిక వర్గంపై భిన్న వాదనలు


బలవన్మరణాన్ని ఆశ్రయించి దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలకు తెర తీసిన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల చదువులో మెరిట్ స్టూడెంటేనట. సెంట్రల్ వర్సిటీలో అతడు రిజర్వేషన్ కేటగిరీ కింద కాకుండా జనరల్ కోటాలోనే సీటు సాధించాడట. ఈ మేరకు నిన్న ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యలను ఊటంకిస్తూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆసక్తికర కథనాన్ని రాసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రోహిత్, అగ్రవర్ణాలకు కొమ్ముకాసిన వర్సిటీ అధికారుల వైఖరికి నిరసనగానే ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్ ఆదివారం వర్సిటీ హాస్టల్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉంటే, రోహిత్ సామాజిక వర్గం (కులం)పైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోహిత్ తండ్రి బీసీ జాబితాలోని ‘వడ్డెర’ కులానికి చెందిన వారని, ఈ నేపథ్యంలో రోహిత్ అసలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడే కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు వర్సిటీలో తగిన ఆధారాలు లేవని తెలుస్తోంది. అడ్మిషన్ సందర్భంగా తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడినేనని పేర్కొన్న రోహిత్, అందుకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రాన్ని మాత్రం జత చేయలేదు. జనరల్ కోటాలో సీటు సాధించిన నేపథ్యంలో సదరు ధ్రువీకరణ పత్రాన్ని రోహిత్ సమర్పించాల్సిన అవసరం లేకపోయిందట.

  • Loading...

More Telugu News