: 10 రోజులు ప్రశ్నించినా...నా నుంచి ఏమీ రాబట్టలేరు: ఎన్ఐఏకు సల్వీందర్ ఝలక్!
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన విచారణ బాధ్యతలను చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు ఇటీవల షాక్ తగిలింది. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు గురుదాస్ పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్ సహకరించారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆయనను పలుమార్లు ప్రశ్నించిన ఎన్ఐఏ అధికారులు తాజాగా నిన్న ఆయనకు సత్య శోధన పరీక్షలు చేశారు. గత వారం జరిగిన విచారణ సందర్భంగా సల్వీందర్ ఎన్ఐఏ అధికారులకు ఝలకిచ్చేలా ఓ వ్యాఖ్య చేశారట. ‘‘నన్ను మరో 10 రోజులు ప్రశ్నించినా... నా నుంచి ఏమీ రాబట్టలేరు. ఎందుకంటే ఈ దాడితో నాకు సంబంధం లేదు. అసలు నేనేమీ చేయలేదు’’ అని ఆయన పేర్కొన్నారట. ఈ కారణంగానే సల్వీందర్ కు ఎన్ఐఏ అధికారులు లై డిటెక్టర్ పరీక్షలు చేసినట్లు సమాచారం.