: ఆ సబ్బు వాడితే అందం రాలేదు కానీ, రూ. 30,000 మాత్రం వచ్చాయి!
'మా సబ్బు వాడండి, అందం వెతుక్కుంటూ వస్తుంది' అంటూ ప్రకటనలతో ఊదరగొట్టిన సంస్థ వినియోగదారుకి 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. మలయళం టీవీ ఛానెల్స్ లో ప్రకటనలతో ఊదరగొడుతున్న 'ఇందులేఖ' సబ్బుతో తన ఫేట్ మారుతుందని భావించిన చాతూ అనే వినియోగదారు ఏడాది పాటు ఆ సబ్బును వాడారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆ సబ్బు ప్రకటనలో నటించిన మమ్ముట్టి, ఆ సబ్బును తయారు చేస్తున్న సంస్థ తనను మోసం చేశాయంటూ వాయానంద్ లోని వినియోగదారుల కోర్టులో 2015 సెప్టెంబర్ లో కేసు నమోదు చేశారు. సమాజంలో ఎంతో పలుకుబడి, ప్రభావం ఉన్న మమ్ముట్టి చేసిన ప్రకటనను చూసి ఆ సబ్బును వాడానని, అయితే ఎలాంటి ఫలితం లేదని, తనకు నష్టపరిహారం అందజేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఎలాంటి ప్రతివాదనకు అవకాశం ఇవ్వకుండా, పరిహారంగా 30,000 రూపాయలు చెల్లిస్తామని 'ఇందులేఖ' సబ్బు తయారీ సంస్థ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది.