: పేర్లు చెప్పకుండానే తిట్టిపోసిన రాహుల్ గాంధీ!
"ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య రాజకీయ పోరుగా మార్చవద్దు. మేం వేముల రోహిత్ కు న్యాయం కోసం పోరాడుతున్నాం"... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి వచ్చిన రాహుల్ గాంధీ మరికొన్ని క్షణాల్లో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారన్న వేళ ఓ విద్యార్థి నేత చేసిన విన్నపమిది. ఈ మాటలను రాహుల్ గాంధీ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. అయితే, ఎవరి పేర్లనూ చెప్పకుండానే కేంద్ర మంత్రులు, వర్శిటీ అధికారులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో కూర్చున్న మంత్రి, విశ్వవిద్యాలయం అధికారులు రోహిత్ మృతికి కారణమని దుయ్యబట్టారు. "ఓ యువకుడు దేశానికి మేలు చేద్దామని ఈ వర్శిటీకి వచ్చాడు. విద్య నేర్చుకుని ఏదో సాధించాలన్నది అతని ఆశ. కానీ, జరిగింది వేరు. అతనికి బాధ కలిగింది. మరణం తప్ప మరే విధమైన మార్గం లేదనే భావన కలిగించింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పరిస్థితి కల్పించింది మాత్రం ఢిల్లీలోని మంత్రి" అని స్మృతీ ఇరానీ పేరు చెప్పకుండానే నిప్పులు చెరిగారు. "ఆ విద్యార్థిని లైబ్రరీలోకి రానివ్వలేదు. ఆకలైతే తినేందుకు క్యాంటీన్ కు పోనివ్వలేదు. ఇతర సదుపాయాలన్నీ తొలగించారు. ఇది అత్యంత అమానుషం. దీని వెనకున్న వారు కచ్చితంగా శిక్షార్హులే" అన్నారు.