: నష్టాలను మరిచి హైజంప్ చేసిన 'బుల్'!
ఇటీవలి నష్టాలను తొసిరాజని భారత స్టాక్ మార్కెట్ సూచికలు భారీ లాభాలను నమోదు చేశాయి. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 100 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ ఆపై వెనుదిరిగి చూడలేదు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ సంస్థల నుంచి ఈక్విటీల కొనుగోళ్లకు మద్దతు కనిపించింది. నిఫ్టీ సూచిక అత్యంత కీలకమైన 7,450 పాయింట్ల వద్ద మద్దతును పరీక్షించుకుంది. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 291.47 పాయింట్లు పెరిగి 1.21 శాతం లాభంతో 24,479.84 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 84.10 పాయింట్లు పెరిగి 1.14 శాతం లాభంతో 7,435.10 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.75 శాతం, స్మాల్ క్యాప్ 1.74 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 38 కంపెనీలు లాభాల్లో నడిచాయి. యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఐడియా, టాటా మోటార్స్, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభపడగా, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మారుతి సుజుకి, టెక్ మహీంద్రా, విప్రో తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 92,50,866 కోట్లకు చేరింది. బీఎస్ఈలో మొత్తం 2,824 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,733 కంపెనీలు లాభాలను, 947 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.