: ఆ లేఖలే కీలకం...హెచ్ సీయూకి హెచ్ఆర్డీ ఏం చెప్పింది?
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ)లో కలకలం రేపిన వేముల రోహిత్ (28) ఆత్మహత్య నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఆరు లేఖలు ఆసక్తి రేపుతున్నాయి. హెచ్ సీయూ ఘటన అంశంలో హెచ్ఆర్డీ ఎలాంటి జోక్యం చేసుకోలేదని చెబుతున్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యలకు భిన్నంగా ఆమె శాఖ నుంచి హెచ్ సీయూకి నాలుగు లేఖలు అందాయి. హెచ్ సీయూ జాతి వ్యతిరేకులు, కులవాదులు, ఉగ్రవాదుల అడ్డాగా మారిందని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హెచ్ ఆర్డీ మినిస్ట్రీకి లేఖ రాశారు. దీనిని జత చేస్తూ, సెప్టెంబర్ 24న, అక్టోబర్ 6న, 20న, నవంబర్ 19వ తేదీల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాసిన ఫిర్యాదుపై మీ స్పందన ఏంటి, ఏ చర్యలు తీసుకున్నారంటూ హెచ్ సీయూకి హెచ్ ఆర్డీ లేఖలు రాసింది. ఈ ఘటనలో ఏబీవీపీ విద్యార్థిపై దాడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్న యూనివర్సిటీ అధికారులు, అప్పటి ఘటనకు కారకులంటూ ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీంతో, సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని కోరుతూ వారు ఆందోళన చేపట్టారు. రోజులు గడుస్తున్నా యూనివర్సిటీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మనస్తాపానికి గురైన రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.