: పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఒక్కడినే ఉన్నాను: ప్రముఖ కమెడియన్ కికు శార్దా
పోలీసులు తనను అరెస్టు చేసినప్పుడు ఒక్కడినే ఉన్నానని.. తాను భయపడలేదు కానీ, షాక్ కు గురయ్యానని ప్రముఖ కమెడియన్ కికు శార్దా అన్నారు. తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీంను అనుకరిస్తూ ఇటీవల ఒక కామెడీ షోలో కికు నటించారు. దీంతో గుర్మీత్ సింగ్ భక్తులు, అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీంతో కికు శార్దాను హర్యానా పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన మర్నాడు తనను క్షమించాలంటూ కికు శార్దా ఒక ట్వీట్ చేశాడు. ‘ప్రేక్షకులను నవ్వించాలన్న ఉద్దేశంతోనే నేను గుర్మీత్ సింగ్ ను అనుకరించాను. ఎవరి మనసూ నొప్పించాలని ఈ విధంగా చేయలేదు. అందుకు క్షమాపణలు చెబుతున్నాను. అయితే, భయపడి మాత్రం నేను క్షమాపణలు చెప్పడం లేదు’ అంటూ కికు శార్దా ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో కమెడియన్ గా ప్రజాదరణ పొందిన శార్దాకు సినిమా, టీవీ నటులు, సంఘాలు మద్దతుగా నిలిచాయి.