: వీసీ, కేంద్రమంత్రిని కఠినంగా శిక్షించాలి: రాహుల్ గాంధీ


ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ విషయంలో వీసీ, కేంద్ర మానవ వనరుల మంత్రి సక్రమంగా వ్యవహరించలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. హైదరాబాదాలోని సెంట్రల్ యూనివర్శిటీని ఈరోజు ఆయన సందర్శించారు. రోహిత్ తల్లి రాధికను ఓదార్చారు. విద్యార్థి కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ, జ్ఞానసముపార్జన కోసం విద్యార్థులు విశ్వవిద్యాలయాలకు వస్తారని, అటువంటి విద్యార్థులపై పక్షపాత ధోరణి చూపటం సమంజసం కాదని అన్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలని అన్నారు. విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను రాజకీయ నాయకుడిగా ఇక్కడికి రాలేదని, విద్యార్థులకు ఎప్పుడు అవసరమైనా వారికి అండగా నిలుస్తానని అన్నారు. రోహిత్ వ్యవహారంలో వర్శిటీ ఉప కులపతి, ఢిల్లీలోని కేంద్రమంత్రి సక్రమంగా నడచుకోలేదని ఆయన ఆరోపించారు. విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి చనిపోతే, వారి కుటుంబాన్ని పరామర్శించే నైతిక బాధ్యత వీసికి లేదా? అని ప్రశ్నించారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైన వీసీ, కేంద్రమంత్రిని కఠినంగా శిక్షించాలని, రోహిత్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News