: జైట్లీ గారూ, బడ్జెట్ ఎలా ఉండాలంటే... ప్రజల కోరికల చిట్టా!
వచ్చే నెలాఖరులో పార్లమెంట్ ముందుకు 2016-17 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనలు రానున్నాయి. ఇప్పటికే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివిధ విభాగాలు, ఇతర మంత్రిత్వ శాఖలతో ముందస్తు సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేశారు. ఇక ఈ బడ్జెట్ ఎలా ఉండాలి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఏ విభాగాల్లో రాయితీలు అడుగుతున్నారు? తదితర విషయాలపై 'ఎకనామిక్ టైమ్స్' ప్రత్యేక పోల్ ను నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు పన్ను చెల్లింపు అవధులను పెంచాలని కోరడం గమనార్హం. బడ్జెట్ ఎలా ఉండాలి?: అన్ని విభాగాల్లో సమతుల్యం పాటించాలని, పన్నులను పెంచరాదని 45.4 శాతం మంది వ్యాఖ్యానించగా, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే ఫర్వాలేదని 26.3 శాతం మంది, పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వకంగా ఉండాలని 25 శాతం మంది వెల్లడించారు. మరో 3.3 శాతం మంది బడ్జెట్ కొంత కఠినంగా ఉంటేనే ఇండియా ముందడుగు వేస్తుందని అభిప్రాయపడ్డారు. కనీస పన్ను అవధులు ఎలా ఉండాలి? 60 ఏళ్లలోపు వయసున్న అందరికీ సాలీనా రూ. 3 లక్షల వరకూ పన్నుల్లేని ఆదాయం పొందేందుకు అవకాశం ఇవ్వాలని 52 శాతం మంది కోరగా, ద్రవ్యోల్బణం హెచ్చుతగ్గులకు అనుగుణంగా అవధులు మారే వ్యవస్థ ఉండాలని 43 శాతం మంది కోరారు. ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీలపై: వివిధ పెట్టుబడులు, కేంద్ర పథకాల్లో పెట్టే మొత్తాలపై రూ. 3 లక్షల వరకూ రాయితీలు ఇవ్వాలని 49 శాతం మంది డిమాండ్ చేస్తుండగా, ప్రస్తుతం రూ. 1.5 లక్షల వరకూ ఉన్న రాయితీలను రూ. 2 లక్షలకు చేయాలని 22 శాతం మంది, సంపాదనకు అనుగుణంగా రాయితీలు కల్పించాలని 23 శాతం మంది తెలిపారు. ఇక 14 శాతానికి చేరిన సర్వీస్ టాక్స్ ను తగ్గించాల్సిందేనని 73 శాతం మంది పేర్కొనగా, లగ్జరీ టాక్స్, బహుమతులపై విధిస్తున్న పన్ను, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను, డివిడెండ్ అందుకుంటే చెల్లించాల్సిన పన్నులను తగ్గించాలని అత్యధికులు కోరారు. సాలీనా రూ. 40 లక్షలు సంపాదిస్తున్న వారిపై ఉన్న 40 శాతం టాక్స్ స్లాబ్ తొలగించాలని 39 శాతం మంది కోరారు. వ్యవసాయంపై వచ్చే ఆదాయంపై పన్నులను పూర్తిగా తొలగించాలని 29 శాతం మంది డిమాండ్ చేశారు. వైద్య బీమా కింద అమలవుతున్న రూ. 25 వేల పన్ను రాయితీ సరిపోతుందని 37 శాతం మంది, దీన్ని రూ. 35 వేలకు పెంచాలని 43 శాతం మంది, ఆదాయం ప్రకారం ఈ బీమా ఉండాలని 20 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఒక నెలలో ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ రూ. 1,800 చేయాలని 68 శాతం, పిల్లల విద్య నిమిత్తం నెలకు రూ. 100 వరకూ అలవెన్సులు ఇవ్వాలని 69 శాతం మంది, హాస్టల్లో చదువుతున్న పిల్లలుంటే దాన్ని రూ. 300కు పెంచాలని 37 శాతం మంది వివరించారు. ఇది సగటు పన్ను చెల్లింపుదారుల కోరికల చిట్టా. ఏతావాతా తెలీకుండా జేబులను గుల్లచేసే పన్నులు వేసి రాబిన్ హుడ్ మాదిరిగా కాకుండా, కోరినవి ఇచ్చే శాంతాక్లజ్ లా జైట్లీ ఉండాలన్నది ప్రజల అభిమతం. మరి ఆర్థిక మంత్రి ఏం చేస్తారో?!