: రాహుల్ ను అడ్డుకోబోయిన ఏబీవీపీ కార్యకర్తలు... అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్యతో వేడెక్కిన రాజకీయం నేపథ్యంలో భాగ్యనగరికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. కేవలం ఓ రాష్ట్రానికి చెందిన సమస్యను చిలవలు పలవలుగా చూపి రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టు సమీపంలో రాహుల్ గాంధీ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ఏబీవీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు యత్నించారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులను పక్కకు లాగేసి రాహుల్ కాన్వాయ్ ను ముందుకు పంపారు. ఆ తర్వాత ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.