: ఫిక్సింగ్ లో గ్రాండ్ స్లామర్లు... స్పందించిన ఫెదరర్, జకోవిచ్, షరపోవా, సెరీనా


టెన్నిస్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని, అందులో గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న వారు కూడా ఉన్నారని వచ్చిన వార్తలు ప్రపంచ టెన్నిస్ రంగంలో సంచలనం సృష్టించగా, దిగ్గజ ఆటగాళ్లు నేడు స్పందించారు. తనను కలిసి మ్యాచ్ ఓడిపోతే రూ. 1.35 కోట్లు ఇస్తామని ఓ వ్యక్తి సంప్రదింపులకు వచ్చాడని ఇప్పటికే జకోవిచ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. తాను ఆ ఆఫర్ ను తిరస్కరించానని, అంతకుమించి ఇంకేమీ తెలియదని కూడా జకో వివరించాడు. ఇక స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఈ విషయమై స్పందిస్తూ, "ఇలాంటి వార్తలు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు. టెన్నిస్ ను పారదర్శకంగా, అభిమానులకు నచ్చేలా ఉంచేందుకు చర్యలు చేపట్టాలి. ఆరోపణలపై విచారించాలి. ఇటువంటి విషయాలకు నేనెంతో దూరంగా ఉంటాను. ఇక ఎవరో వచ్చిన నన్ను కలిస అవకాశాలే లేవు" అన్నాడు. ఈ ఉదయం మీడియా ముందుకు వచ్చిన షరపోవా స్పందిస్తూ, "ఈ ఆటతో నేనెంతో సంపాదించాను. అక్రమ మార్గాల గురించిన ఆలోచనే నాకు అవసరం లేదు. ఇక ప్రస్తుతం వచ్చిన ఆరోపణలు అసత్యమని నమ్ముతున్నా. టెన్నిస్ ఆట డబ్బు కోసం కాదన్నది నా నమ్మకం. మిగతా ఆటగాళ్లూ నాలానే ఆలోచిస్తున్నారని భావిస్తున్నా" అని వెల్లడించింది. మరో మహిళా టెన్నిస్ తార సెరీనా విలియమ్స్ మాట్లాడుతూ, "ఫిక్సింగ్ స్కామ్ గురించి ఈ ఉదయం మాత్రమే నేను విన్నాను. అంతకుముందు ఎక్కడా వినలేదు. టాప్-50 ఆటగాళ్లు ఫిక్సింగ్ కుంభకోణంలో ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. అనుమానాస్పద స్థితిలో పేరున్న ఆటగాళ్లు ఓడిపోవడం నా దృష్టికి ఎప్పుడూ రాలేదు" అంది. కాగా, ఆటగాళ్లను హోటల్ గదుల్లో కలుసుకునే బుకీలు, ఒక్కో మ్యాచ్ లో తాము చెప్పినట్టు ఆడితే 50 వేల డాలర్లు (సుమారు రూ. 35 లక్షలు) ఇస్తామని ఆశ చూపినట్టు ఆధారాలతో ఉన్న వివిధ డాక్యుమెంట్లను తాము చూశామని బీబీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News