: 25 ఏళ్ల కనిష్ఠానికి చైనా వృద్ధి, మోదీ ముందున్న కాలానికి భారత మార్కెట్!


ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరింత భయాన్ని పుట్టించేలా 2015 చైనా వృద్ధి గణాంకాలు నేటి ఉదయం విడుదలయ్యాయి. గడచిన 25 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి జీడీపీ గణాంకాలు దిగజారడం కొత్త భయాలను పుట్టించింది. గత సంవత్సరం చైనాలో వృద్ధి 6.9 శాతానికి పరిమితం కాగా, 1990 తరువాత ఇదే అతి తక్కువ. కొత్త గణాంకాల మేరకు చైనా జీడీపీ 67.67 ట్రిలియన్ యువాన్లు (సుమారు 10.3 ట్రిలియన్ డాలర్లు)గా ఉండగా, ఉత్పత్తి రంగాన్ని అధిగమించిన సేవారంగం 50.5 శాతం వాటాను నమోదు చేసింది. ప్రధానంగా మాన్యుఫాక్చరింగ్ సెక్టారు కీలకమైన చైనాలో ఆ రంగం సవాళ్లను ఎదుర్కొంటుండటమే జీడీపీ కుంచించుకు పోవడానికి కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, భారత మార్కెట్ నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు తీసుకోవడానికి పూర్వం ఉన్న స్థాయికి పడిపోయింది. పడిపోతున్న క్రూడాయిల్ ధరలు, కీలక సంస్కరణలేవీ అమల్లోకి రాకపోవడం తదితర కారణాలతో సెన్సెక్స్, నిఫ్టీలు మే 2014 నాటి స్థాయికి దిగజారాయి. మే 16న సెన్సెక్స్ సూచిక 24,180 పాయింట్ల వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఈ 20 నెలల కాలంలో 29 వేలను తాకిన సెన్సెక్స్, తిరిగి 24, 180 పాయింట్లకు వచ్చింది. అయితే, భారత ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయని, అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడ్డ మార్పుల కారణంగానే, సూచికల్లో అమ్మకాల ఒత్తిడి వస్తోందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారని, సూక్ష్మ స్థాయిలో గణాంకాలు మెరుగుపడటం లేదని బీఎన్పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ శ్రేయాస్ దేవాల్కర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News