: అవన్నీ చిన్న గొడవలు...రోహిత్ సూసైడ్ తో షాక్ కు గురయ్యా: ఏబీవీపీ నేత సుశీల్


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై అతడి ప్రత్యర్థి, ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ ఎట్టకేలకు నోరు విప్పాడు. వర్సిటీ గొడవల్లో నిత్యం కత్తులు దూసుకున్న రోహిత్, సుశీల్ కుమార్ లు ఐదేళ్లుగా వర్సిటీలో ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. సుశీల్ అభ్యర్థన మేరకే కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వర్సిటీ అధికారులకు లేఖ రాశారు. ఈ క్రమంలో రోహిత్ ఆత్మహత్యకు సుశీల్ కుమార్ కూడా ప్రధాన కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నటిదాకా మీడియాకు కాస్తంత దూరంగా ఉన్న సుశీల్ నేటి ఉదయం ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ ‘ద న్యూస్ మినిట్’తో మాట్లాడారు. వర్సిటీ రాజకీయాల్లో ప్రత్యర్థులుగానే ఉన్నా, రోహిత్ ఆత్మహత్య తనను షాక్ కు గురి చేసిందని సుశీల్ విస్మయం వ్యక్తం చేశాడు. రోహిత్ ను ధైర్యవంతుడిగా అభివర్ణించిన సుశీల్... అతడి ఆత్మహత్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నాడు. వర్సిటీలో రోహిత్ తనకు ఐదేళ్లుగా తెలుసని, అయితే ఏనాడూ తమ అభిప్రాయాలు కలవలేదని అన్నాడు. అయినా తమ మధ్య ఉన్న విభేదాలు స్టూడెంట్ తగాదాలేనని అతడు చెప్పాడు. గతేడాది ఆగస్టులో వర్సిటీలో తాము ఏర్పాటు చేసిన పోస్టర్లను రోహిత్ చించేశాడని, ఆ తర్వాత జరిగిన వాగ్వాదం తర్వాత తాను రోహిత్ తో మాట్లాడటం మానేశానని కూడా చెప్పాడు. రోహిత్ లాంటి ధైర్యస్థుడు ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ అనుకోరని సుశీల్ వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News