: రోహిత్ ది ఆత్మహత్య కాదు, అది ప్రజాస్వామ్య హత్య ... కేజ్రీ వాల్ ట్వీట్స్
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ మృతి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తలదూర్చిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లేఖ నేపథ్యంలో రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులను వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ ను ఎత్తివేయాలని 14 రోజుల పాటు ఆందోళన చేసిన రోహిత్ మొన్న హాస్టల్ గదిలో ఉరేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆందోళనలకు కారణమైంది. ఈ ఘటనను సీరియస్ గా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు హైదరాబాదుకు రానున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఆత్మహత్యపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. రోహిత్ ది ఆత్మహత్య కాదని పేర్కొన్న కేజ్రీ... అది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. ‘‘దళితుల ఉద్ధరణకు పాటుపడాల్సిన మోదీ ప్రభుత్వం ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేసింది. రోహిత్ ది ఆత్మహత్య కాదు. అది ముమ్మాటికీ ప్రజాస్వామ్య హత్య. సామాజిక న్యాయం, సమానత్వ హత్య. దీనికి బాధ్యులైన మంత్రులను మోదీ తన కేబినెట్ నుంచి సస్పెండ్ చేయాలి. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని కేజ్రీ ట్విట్టర్ లో డిమాండ్ చేశారు.