: ఆస్తుల వెల్లడికి జగన్ దూరం... 13 మంది ఏపీ మంత్రులు కూడా!

ఏపీ అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో తమ ఆస్తులను వెల్లడించిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను ఇప్పటిదాకా కేవలం 46 మంది మాత్రం తమ ఆస్తుల చిట్టాలను అసెంబ్లీకి సమర్పించారు. వీరిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు (కుప్పం ఎమ్మెల్యే) అందరికన్నా ముందుండి ఆదర్శంగా నిలిచారు. ఇక సభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (పులివెందుల ఎమ్మెల్యే) తన ఆస్తులను వెల్లడించలేదు. జగన్ తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప సహా కేబినెట్ లో కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, నారాయణ, శిద్ధా రాఘవరావు, కిమిడి మృణాళిని, పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత, పరిటాల సునీతలతో పాటు చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, విప్ చింతమనేని ప్రభాకర్ కూడా తమ ఆస్తులను వెల్లడించలేదు. ఈ మేరకు ఆస్తులు వెల్లడించిన వారి వివరాలను అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిన్న ప్రకటించారు.