: ఇకపై వాట్సాప్ ఉచితం!
ఇకపై వాట్సాప్ వినియోగదారుల నుంచి ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా సేవలందిస్తామని ఈ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఒక బ్లాగ్ లో ఈ విషయాన్ని పేర్కొంది. ప్రస్తుతం వాట్సాప్ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకుని ఒక ఏడాది పాటు వాడుకోవచ్చు. ఆ తర్వాత ఏడాదికి రూ.67 చొప్పున చెల్లించి, ఈ మెసేజింగ్ యాప్ ని వినియోగించుకోవచ్చు. అయితే, వాట్సాప్ వినియోగదారుల్లో క్రెడిట్, డెబిట్ కార్డులు లేనివారు కూడా చాలా మంది ఉండటంతో వారు డబ్బులు చెల్లించలేకపోతున్నారు. దీంతో వారి మిత్రులు, సన్నిహితులు తదితరులతో వాట్సాప్ ద్వారా ఉన్న సంబంధాలకు బ్రేక్ పడుతోందని పలువురు వినియోగదారులు బాధపడుతున్న విషయం సంస్థ దృష్టికి వచ్చిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ బ్లాగ్ లో పేర్కొంది. ఈ ఛార్జీలను త్వరలోనే రద్దు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. కాగా, వాట్సాప్ ఇప్పుడు కొంత మందిని మాత్రమే రూ.67 చెల్లించమని అడుగుతోంది. ఇకపై ఆ ఫీజు కూడా త్వరలోనే రద్దు చేయాలనుకుంటున్నట్లు ఆ పోస్ట్ లో వాట్సాప్ సంస్థ పేర్కొంది.