: సోషల్ మీడియాలో 40 శాతం యువతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదే!
ఏదైనా ఓ శుభ సందర్భంగా చక్కగా ఫోటో తీయించుకుని, లేదా స్నేహితులతో కలిసి ఓ సెల్ఫీ దిగి దాన్ని ఇతరులతో పంచుకోవాలని భావించని వారుండని కాలమిది. ఇదే సమయంలో మీరు పెట్టిన చిత్రాలను మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్లలో పెడుతున్నారన్న సంగతి ఎంత మందికి తెలుసు? ముఖ్యంగా యువతలవి! ఇండియాలో సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెడుతున్న అమ్మాయిల్లో 40 శాతం మంది చిత్రాలు పోర్న్ సైట్లు లేదా అశ్లీల వెబ్ సైట్లలోకి ఎక్కుతున్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు? ఓ ఆంగ్ల దినపత్రిక ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ తరహాలో వేరెవరివో చిత్రాలను మార్చి తమ పబ్బం గడుపుకుంటున్న వారి ఆటకట్టించేందుకు ఎథికల్ హాకర్స్ కృషి చేస్తున్నా, అసంఖ్యాకంగా ఉన్న కామాంధుల పనులు యథావిధిగా సాగుతూనే ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో చిత్రాలను పెట్టిన యువతుల్లో కనీసం 40 శాతం మంది హ్యాకర్ల బారినపడ్డారని నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సైబర్ ముప్పు ఇదేనని అంచనా. అశ్లీల చాటింగ్ లేదా నెటిజన్లను ఆకర్షించేందుకు అందంగా ఉన్న యువతుల ఫోటోలను వారు వాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై పెద్దగా ఫిర్యాదులు లేకపోడవంతో పోలీసులు సైతం చూస్తూ మిన్నకుంటున్నారని సైబర్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా, అమ్మాయిలు అప్రమత్తంగా ఉండటమే దీనికి విరుగుడని పేర్కొంటున్నారు.