: 'మేకిన్ ఇండియా' రైల్వే లగ్జరీ కోచ్ ల స్పెషాలిటీలివే!
'మేకిన్ ఇండియా' ప్రచారానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేలా అధునాతన లగ్జరీ రైలు బోగీలను తయారు చేయాలన్న మోదీ ప్రభుత్వ సంకల్పం తొలి దశ నెరవేరింది. భోపాల్ లోని రైల్వే కోచ్ ల పునర్వ్యవస్థీకరణ కేంద్రంలో పాత రైలు పెట్టెలను అత్యాధునిక లగ్జరీ కోచ్ లుగా తీర్చిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండవ తరగతి ప్రయాణానికి నిర్దేశించిన బోగీలను సైతం అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ప్రతి కూపేలో చార్జర్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, మాడ్యులర్ టాయిలెట్లు వీటిల్లోని ప్రత్యేకత. ఇక స్లీపర్ క్లాస్ బోగీలను సమూలంగా మార్చారు. మరింత సులువుగా పై బెర్తులకు చేరేందుకు నిచ్చెనలు, మెరుగైన కుషన్, ప్రతి బెర్తుకూ చార్జర్ పాయింట్, ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్, పర్సు, సెల్ ఫోన్ పెట్టుకునేందుకు పౌచ్, సైడ్ బెర్తులకు రీడింగ్ లైట్లు, ఫైర్ ప్రూఫ్ సీట్లు, పెయింటెడ్ కార్పెట్ తరహా ఫ్లోర్ తదితరాలను ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ లైట్లు, కొత్త ఫ్యాన్లతో బోగీలను ఆధునికీకరించారు. ఇక సెకండ్, ఫస్ట్ ఏసీ బోగీల్లో ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లకు విడివిడిగా చార్జింగ్ పాయింట్లు, మరింత మెరుగైన కుషన్, ఎలక్ట్రిక్ విండోలను ఏర్పాటు చేశారు. ప్యాంట్రీ కార్ ఇంటీరియర్ నూ ఆధునిక పరికరాలతో మార్చారు. ఇప్పటి వరకూ 11 కోచ్ లు తయారు కాగా, వీటిల్లో 87 నాన్ ఏసీ, 17 థర్డ్ ఏసీ, 5 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ బోగీ, ఒక చైర్ కార్ లు ఉన్నాయి. నూతనంగా ఏసీ బోగీ తయారీకి రూ. 70 లక్షలు, స్లీపర్ కోచ్ తయారీకి రూ. 49 లక్షలు అవుతున్నట్టు అధికారులు తెలిపారు. వీటిని తొలిసారిగా జబల్ పూర్, హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే మధ్యప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో వినియోగించనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. కొన్ని బోగీలను కోల్ కతాకు తరలించి అక్కడి నుంచి దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు వినియోగిస్తామని పేర్కొంది.