: ఇరాన్ దెబ్బకు 28 డాలర్ల దిగువకు క్రూడాయిల్!


గతంలో ఇరాన్ పై విధించిన పలు ఆంక్షలను తొలగిస్తున్న అమెరికా ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర మరింతగా పతనమైంది. ఇప్పటికే సరఫరా అధికమై ధరలు దిగజారుతున్న వేళ, ఇరాన్ నుంచి సైతం క్రూడాయిల్ మార్కెట్లోకి రానుందన్న వార్తలే ఇందుకు కారణం. ఆంక్షల తొలగింపుతో ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇరాన్ భారీగా ముడి చమురును విక్రయానికి ఉంచనున్నట్టు ప్రకటించింది. దీంతో సోమవారం నాటి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారల్ కు 27.67 డాలర్లకు పడిపోయింది. 2003 తరువాత ముడి చమురు ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఇక యూఎస్ క్రూడాయిల్ 38 సెంట్లు పడిపోయి 29.04 డాలర్లకు చేరింది. 2003లో యూఎస్ క్రూడాయిల్ అతి తక్కువగా 28.36 డాలర్లను తాకింది. సమీప భవిష్యత్తులో ఆ ధరను దాటి పతనం కావచ్చని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, రోజుకు 5 లక్షల బ్యారళ్ల ముడిచమురును సరఫరా చేస్తామని ఇరాన్ ప్రకటించింది. 2011 ప్రాంతంలో ఇరాన్ నుంచి రోజుకు 10 లక్షల బ్యారళ్ల వరకూ సరఫరా అవుతుండేది. ఆ సమయంలో అమెరికా ఆంక్షలతో ఇరాన్ ముడిచమురు వెలికితీతకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి ఉత్పత్తిని ప్రారంభించింది. ఇదిలావుండగా, నేటి మార్కెట్లో భారత క్రూడాయిల్ బాస్కెట్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే 2.15 శాతం తగ్గి రూ. 1,946 వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News