: ప్రేమ కోసం లొంగిపోయిన మావోకు బహుమతిగా పోలీసు ఉద్యోగం... ఘనంగా పెళ్లి


లక్ష్మణ్ పొడియాల్... జన్ మిలీషియా డిప్యూటీ కమాండర్. కోషీ మార్కం... మావోయిస్టు సభ్యురాలు. బస్తర్ అడవుల్లో కలుసుకున్నారు. ప్రేమించుకున్నారు. తాము పెళ్లి చేసుకుంటామని మావో నేతలను సంప్రదించగా, వారు అనుమతి నిరాకరించారు. ప్రేమ కోసం వారిద్దరూ లొంగిపోగా, బస్తర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి వారి పెళ్లిని వైభవంగా జరిపించడంతో పాటు ఇద్దరికీ పోలీసు ఉద్యోగాలు ఇచ్చారు. "మిగిలిన మావోలకు మా నుంచి మంచి సందేశాన్ని పంపేందుకే ఇలా చేశాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అడవుల్లో ఇద్దరు మావోల వివాహానికి ఎలాంటి అభ్యంతరాలూ లేవు. ఛత్తీస్ గఢ్ లో మాత్రం అలా కాదు. ప్రేమించుకున్న వారిని నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటనలూ ఉన్నాయి. లొంగిపోవాలన్న వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం" అని బస్తర్ రేంజ్ ఐజీ ఎస్ఆర్పీ కల్లూరి వ్యాఖ్యానించారు. కాగా, వైభవంగా జరిగిన ఈ వివాహానికి దాదాపు 5 వేల మంది అతిథులు వచ్చారు. వారిలో ఐజీ, కలెక్టర్, ఇతర పోలీసు, ప్రభుత్వ అధికారులు కూడా ఉండటం గమనార్హం. గతంలో తాము పోలీసులకు వ్యతిరేకంగా పోరాడామని, ఇక మావోలను రూపుమాపేందుకు కృషి చేస్తామని పెళ్లిపీటలపై గులాబీ రంగు సాఫా ధరించిన లక్ష్మణ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News