: 'డాక్టర్ డెత్'గా పేరు తెచ్చుకున్న నాగారెడ్డిని అరెస్ట్ చేసిన యూఎస్ పోలీసులు
అమెరికాలో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తూ, 36 మంది మరణానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై భారత సంతతి వైద్యుడు నరేంద్ర నాగారెడ్డిని జార్జియా పరిధిలోని క్లేటౌన్ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈయనను ఇప్పుడు "డాక్టర్ డెత్" అని అభివర్ణిస్తున్నారు. తన వద్దకు వచ్చిన రోగులకు అధిక మోతాదులో మందులు ఇచ్చి వారిని మరణానికి దగ్గర చేశాడన్నది నాగారెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ. యూఎస్ ఫెడరల్, స్థానిక అధికారులు 40 మంది వరకూ నాగారెడ్డి ఇల్లు, కార్యాలయం తదితరాలపై ఏకకాలంలో దాడులు చేశారు. ఆయన ఓ 'పిల్ మిల్'ను కూడా నడుపుతున్నాడని అధికారులు గుర్తించడం గమనార్హం. ఆయన ఆస్తులన్నింటినీ సీజ్ చేశారు. "ఆయన జోన్స్ బోరోలో ఓ సైకియాట్రిస్ట్. ఎన్నో ఏళ్లుగా రోగులకు బెంజోడయాజిపైన్, ఓపియాటిస్ తదితరాలను అధిక మోతాదులో ఇస్తున్నాడు. దీనివల్ల ఎంతో మంది చనిపోయారు" అని క్లేటౌన్ కౌంటీ పోలీసు చీఫ్ మైక్ రిజిస్టర్ మీడియాకు వెల్లడించారు. డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా అటార్నీ కార్యాలయం, పోలీసులు, జార్జియా డిపార్ట్ మెంట్ ఆఫ్ కమ్యూనిటీ సూపర్ విజన్ విభాగాలకు చెందిన వారంతా నాగారెడ్డి నివాసంపై దాడులు చేశారు. ఆయనపై ఆరోపణలనూ నమోదు చేశామని తెలిపారు. ఆయన పేషంట్లలో 36 మంది మరణించారని, అందులో 12 మంది అధిక మోతాదులో ఔషధాల వల్లే మృతి చెందినట్టు పోస్టుమార్టం నివేదికలు వెల్లడిస్తున్నాయని స్పష్టం చేశారు. "ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమే. అతను డాక్టర్ డెత్. ఇందులో ఎంతమాత్రమూ సందేహం లేదు" అని మైక్ వ్యాఖ్యానించడం గమనార్హం.