: ఒక్క కుక్క... నాలుగు విమానాలను ఆపేసింది!


వినడానికి కాస్తంత వింతగానే ఉన్నా... ఓ కుక్క ఏకంగా నాలుగు విమానాలను ఆపేసింది. అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టేలా చేసింది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ఎయిర్ పోర్ట్ లో ఈ ఘటన నిన్న చోటుచేసుకుంది. ముంబై ఎయిర్ పోర్టు చుట్టూ మురికివాడలు ఉన్నాయి. సదరు వాడల్లో పిచ్చి కుక్కలు కూడా ఎక్కువే. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి ముంబై వచ్చిన నాలుగు విమానాలు ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. సరిగ్గా అదే సమయంలో కంచె దాటేసిన ఓ కుక్క నేరుగా రన్ వే పైకి వచ్చేసింది. రన్ వేపై కుక్కను గుర్తించిన ఎయిర్ పోర్టు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎట్టకేలకు కుక్కను రన్ వే పై నుంచి వెళ్లగొట్టారు. ఇదంతా జరిగే సరికి అప్పటికే అరగంట(మధ్యాహ్నం 3.08 గంటల నుంచి 3.39 గంటలు) గడిచిపోయింది. కుక్కను వెళ్లగొట్టేదాకా ఎయిర్ పోర్టు అధికారులు విమానాలను ల్యాండింగ్ కు అనుమతించలేదు. దీంతో ఆ నాలుగు విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. రన్ వే పైనుంచి కుక్క వెళ్లిపోగానే విమానాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా ల్యాండయ్యాయి.

  • Loading...

More Telugu News