: చంద్రబాబు నోట... పిల్లి, ఎలుక కథ!
క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. దాదాపుగా ఇతర పార్టీలతో పోలిస్తే... టీడీపీలోనే అధిష్ఠానం మాటకు ఎదురుండదు. ఓ వైపు సీఎంగా రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టినా, పార్టీలో క్రమశిక్షణ కట్టుతప్పకుండా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తాజాగా నిన్న విజయవాడలో జరిగిన బహిరంగ సభలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వేదికపైనే ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల మధ్య ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాలకు సుతిమెత్తగానే చురకలంటించిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చైనా సంస్కరణల పితామహుడు డెంగ్ జియావో పెంగ్ వ్యాఖ్యలను వల్లె వేశారు. ‘‘పిల్లి తెల్లటిదా?.. ఎర్రటిదా?.. నల్లటిదా? అన్న విషయం ముఖ్యం కాదు. సమర్థంగా ఎలుకలను పడితే చాలు అని డెంగ్ చెప్పారు’’ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో విషయం బోధపడిన ఆనం, సోమిరెడ్డి వర్గాలు లోలోపలే సర్దుకున్నాయి.