: హైటెక్ సీఎం చంద్రబాబు!... మొబైల్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభిస్తానని వెల్లడి


పాలనలో సంస్కరణలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరూ ఇవ్వరేమో. గతంలో పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు పలు కొత్త కార్యక్రమాలను రూపొందించి అమలు చేశారు. తాజాగా పదేళ్ల తర్వాత తిరిగి ఏపీ అధికార పగ్గాలు చేపట్టిన ఆయన తనదైన శైలిలో సరికొత్త కార్యక్రమాలతో దూసుకెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చిన నెల్లూరు జిల్లా సీనియర్ రాజకీయవేత్తలు ఆనం రాంనారాయణరెడ్డి, వివేకానందరెడ్డిలు నిన్న భారీ అనుచరగణంతో విజయవాడకు తరలివెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వారు లాంఛనంగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇక సెల్ ఫోన్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తా. ఒకేసారి లక్షల మందితో మాట్లాడేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నా’’ అని చంద్రబాబు ప్రకటించారు. ‘‘నేను వినూత్నంగా ఆలోచిస్తుంటా. త్వరలోనే కొత్త కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. సెల్ ఫోన్లలో మీరు నన్ను చూస్తూ మాట్లాడొచ్చు. నేను మిమ్మల్ని చూస్తూ మాట్లాడొచ్చు. ఈ సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వస్తే... పొలంలో పురుగు పడితే రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో పొలం నుంచే మాట్లాడొచ్చు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News