: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...‘టీఈడీఎస్’ రూబెన్ కుటుంబం దుర్మరణం
కర్నూలు జిల్లా పరిధిలో నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కేరళ నుంచి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వెళుతున్న టాటా మాంజా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. తెలంగాణ ఎడ్యుకేషనల్ డెవలప్ మెంట్ సొసైటీ (టీఈడీఎస్)కి చెందిన రూబెన్ తన కుటుంబంతో సహా చనిపోయారు. కేరళకు చెందిన రూబెన్... చాలా కాలం క్రితమే మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు వచ్చి స్థిరపడ్డారు. మక్తల్ లో ఓ పాఠశాలను కూడా నిర్వహిస్తున్న ఆయన టీఈడీఎస్ లో కీలక భూమిక పోషిస్తున్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో కేరళలోని తన సొంతూరుకు తండ్రి, తల్లి, సతీమణి, కూతురుతో కలిసి ఆయన వెళ్లారు. సెలవులు ముగిసిన తర్వాత రూబెన్ కుటుంబం మక్తల్ కు తిరుగు ప్రయాణమైంది. హైదరాబాదు- బెంగళూరు జాతీయ రహదారిపై కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి వద్దకు రాగానే అతి వేగం కారణంగా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూబెన్ కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు కారు డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయాడు. మృతులను పోలీసులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.