: మదారసాల్లో ప్రేమను నేర్పించండి: ఆర్ఎస్ఎస్
మదారసాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు దేశాన్ని, ఇతర మతస్తులను ప్రేమించడాన్ని నేర్పాలని, వారికి దేశంకోసం ప్రాణాలర్పించిన ముస్లిం అమర వీరుల కథలను తెలియజేయాలని ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్యానించారు. "వారికి శిక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలి. బహదూర్ షా జాఫర్ వంటి వారి కథలను వినిపించాలి. అది ఎంతో అవసరం. నేను మౌలానాలు, ఇమాంలు, ముల్వీలను ఈ దిశగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దేశాన్ని ప్రేమించేలా వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేశభక్తి కూడా ఇస్లాంలో ఓ భాగమే" అని ఇంద్రేష్ అన్నారు. మానవత్వం, అభివృద్ధికి అవసరమైన కోణాల్లో చిన్నారుల మనసులు పయనించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చిన్నారుల్లో జాతీయతా భావాన్ని పెంచేలా మదారసాలు కృషి చేయాలని సూచించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సైతం మదారసాల్లో విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.