: చిత్తూరు, కడప జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత... 9 మంది వైకాపా ఎమ్మెల్యేల అరెస్ట్


వైకాపా పార్లమెంట్ సభ్యుడు మిధున్ రెడ్డి అరెస్టుతో చిత్తూరు, కడప జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది వైకాపా శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రహదార్లపై రాస్తారోకోలు చేస్తున్నారు. మిధున్ రెడ్డిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రహదార్లపై విధ్వంసం సృష్టించారు. రెండు జిల్లాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను చెదరగొడుతూ వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలిస్తున్నారు. రాజకీయ ప్రతీకారాల్లో భాగంగానే మిధున్ అరెస్ట్ జరిగిందని, చంద్రబాబు భయపెట్టాలని చూస్తున్నారని, ఆయన ఉద్దేశం నెరవేరదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. మరోవైపు మదనపల్లి, పీలేరుకు చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు శ్రీకాళహస్తి బయలుదేరగా, వారిని కలికిరి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, వైకాపా నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. తిరుపతి గాజులమాండ్యం సర్కిల్ లో ఆందోళనకు దిగిన ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సునీల్ కుమార్, నారాయణ స్వామిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ రేణిగుంట పోలీసుస్టేషన్ కు తరలించడంతో స్టేషన్ లోనే వీరి ధర్నా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News